ఇదివరకు ఇంటర్నెట్ ధరలు మరియు బ్రాడ్‌బ్యాండ్ ధరలు వినియోగదారులకు అందనంత ఎక్కువగా ఉండేవి. అయితే టెలికాం రంగంలో జియో రంగప్రవేశం, అలానే ఆ తరువాత ట్రాయ్ సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురావడంతో అవి చాలా వరకు తగ్గి సదరు మధ్యతరగతి వ్యక్తికి కూడా అవి ఎంతో చేరువయ్యాయి. ఇక ప్రస్తుతం ట్రాయ్ సంస్థ టివి ఛానళ్ల ధర తగ్గింపుపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు మనం కేబుల్ మరియు డిటిహెచ్ ల ద్వారా నెలసరి కొంత మొత్తం కట్టి ఛానల్స్ ని వీక్షించడం జరుగుతోంది. అయితే వారందించే చానళ్లలో చాలావరకు మనకు ఉపయోగం లేనివే ఉండడం, అంతేకాక మనం అన్నిటికి కలిపి అద్దెకడుతుండడంతో, ఈ విషయమై కొన్నాళ్లక్రితం ట్రాయ్ ఛానళ్ల యాజమాన్యాలతో చర్చలు జరిపి, ఇటీవల ఒక సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం మనం ఇకపై ఏవైనా మనకు నచ్చిన టివి చానళ్లను మాత్రమే ఎంపిక చేసుకుని, వాటికీ మాత్రమే ధర చెల్లించి చూడవచ్చు. ఈ విధానం వల్ల మనకు అవసరం లేని చానళ్లను చూడవలసిన అవసరం లేకపోవడమే కాక, మనం చూసే చానళ్లకు మాత్రమే ధర చెల్లిస్తే సరిపోతుందన్నమాట.

ఇక ఈ పద్దతికి కొందరు కేబుల్ మరియు డిటిహెచ్ ఆపరేటర్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ట్రాయ్ మాత్రం వినియోగదారుడి సౌలభ్యమే మాకు ముఖ్యమని అంటోంది. అంతేకాక ఇటీవల ట్రాయ్ కొత్త విధివిధానాలను, టారిఫ్‌లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇంతకుముందే కొట్టివేసింది. అయితే ఈ విధానం వల్ల వినియోగ దారులకు కూడా కొంత భారం పడుతుందని, ఫ్రీ టూ ఎయిర్ ద్వారా అందించే చానళ్ళు కాకకుండా మిగిలినవి వాటి ఛానల్స్ ప్యాకెజీలను అమాంతం పెంచే అవకాశం ఉందని కేబుల్ ఆపరేటర్లు వ్యక్త పరుస్తున్న వాదన. అయితే ట్రాయ్ ప్రతినిధులు మాట్లాడుతూ, కొత్త విధివిధానాలను అమలు చేసేందుకు అందరూ సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. అయితే ఈ ప్రక్రియ సాఫీగా, అంతరాయాలు ఏమాత్రం తలెత్తకుండా మార్పిడి జరిగేందుకు మరికొంత సమయం కావాలని వారంతా విన్నవించారన్నారు. వినియోగదారుల నుంచి రకరకాల అప్షన్స్ తీసుకునేందుకు వీలుగా, పంపిణీ ఆపరేటర్లకు జనవరి 31దాకా అవవకాశం కల్పించినట్లు తెలిపారు. కాబట్టి ఈలోగా ఆపరేటర్లందరూ అన్నిరకాల మార్గదర్శకాలను అమలు పరిచే చర్యలు చేపట్టాలని ట్రాయ్ స్పష్టం చేసింది……